mahatma gandhi: మహాత్మాగాంధీ హత్యపై పునర్విచారణ కోరుతూ పిటిషన్... డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- మనోభావాల ఆధారంగా నిర్ణయం తీసుకోవడం కుదరదు
- పునర్విచారణకు తగిన ఆధారాలు సమర్పించాలన్న కోర్టు
- గాడ్సే కాకుండా నాలుగో బుల్లెట్ ను వేరెవరో కాల్చారన్న పిటిషనర్
జాతిపిత మహాత్మాగాంధీ హత్య ఘటనలో తిరిగి విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈ రోజు కొట్టి వేసింది. ముంబైకి చెందిన అభినవ్ భారత్ సంస్థ తరఫున పంకజ్ ఫడ్నిస్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఈ నెల 6న వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది.
ఈ రోజు జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం పిటిషన్ ను రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ అంశంలో మనోభావాల ఆధారంగా నిర్ణయం తీసుకోలేమని, చట్టపరమైన ఆధారాలను సమర్పిస్తే అప్పుడు నిర్ణయిస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఓ విద్యా సంబంధిత పరిశోధన ఆధారంగా ఈ పిటిషన్ వచ్చిందని, ఎప్పుడో జరిగిన ఘటనపై పునర్విచారణకు ఇది ఆధారం కాబోదని పేర్కొంది.
మహాత్మాగాంధీ హత్య కేసులో మూడు బుల్లెట్ల ఆధారంగానే విచారణ జరిపి, నాథూరాం గాడ్సే, నారాయణ్ ఆప్టేలకు ఉరిశిక్ష విధించడం జరిగిందని, కానీ నాలుగో బుల్లెట్ ను గాడ్సే కాకుండా మరో వ్యక్తి కాల్చినట్టు పిటిషనర్ ఫడ్నిస్ తన పిటిషన్ లో ఆరోపించారు.