cbse: సీబీఎస్ఈ పేపర్ లీక్... రెండు పరీక్షలకు రీఎగ్జామ్.. 28 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం
- 10వ తరగతి మ్యాథ్య్, ప్లస్2 ఎకనామిక్స్ పేపర్స్ లీక్
- వాట్సాప్ లో పెద్ద ఎత్తున షేర్ అయిన క్వశ్చన్ పేపర్స్
- రీఎగ్జామ్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించిన సీబీఎస్ఈ
10వ తరగతి మ్యాథ్స్, ప్లస్2 తరగతి ఎకనామిక్స్ పేపర్లకు తిరిగి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు సీబీఎస్ఈ ప్రకటించింది. క్వశ్చన్ పేపర్స్ లీక్ అయ్యాయనే ఆరోపణల నేపథ్యంలో సీబీఎస్ఈ ఈ నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీపై విచారణ జరిపామని... బోర్డు నైతికతను కాపాడేందుకు, విద్యార్థులకు పూర్తి స్థాయిలో న్యాయం చేకూర్చేందుకు ఈ పరీక్షలను మళ్లీ నిర్వహించాలని నిర్ణయించినట్టు సీబీఎస్ఈ తెలిపింది. పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. వారం లోపలే వివరాలన్నింటినీ సీబీఎస్ఈ వెబ్ సైట్లో పొందుపరుస్తామని తెలిపింది.
ప్లస్2 ఎకనామిక్స్ పరీక్ష సోమవారం జరగ్గా, 10వ తరగతి మ్యాథ్స్ ఎగ్జామ్ ఈరోజు జరిగింది. చేతితో రాసిన ఎకనామిక్స్ పేపర్ వాట్సాప్ లో భారీ ఎత్తున సర్క్యులేట్ అయింది. ఈ లీకులో వచ్చిన అనేక ప్రశ్నలు క్వశ్చన్ పేపర్ లో ఉన్నాయి. మార్చ్ 5 నుంచి సీబీఎస్ఈ పరీక్షలు జరుగుతున్నాయి. సీబీఎస్ఈ తీసుకున్న నిర్ణయం ప్రభావం 10వ తరగతి, 12వ తరగతికి చెందిన 28 లక్షల మందికి పైగా విద్యార్థులపై పడనుంది.