ISRO: నింగిలోకి నేడు జీఎస్ఎల్వీ.. సాయంత్రం 4:56 గంటలకు ప్రయోగం
- బుధవారమే ప్రారంభమైన కౌంట్ డౌన్
- కక్ష్యలోకి అత్యంత శక్తిమంతమైన కమ్యూనికేషన్ ఉపగ్రహం
- ఈ ఏడాది పది ఉపగ్రహ ప్రయోగాలు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి నేటి సాయంత్రం 4:56 గంటలకు కమ్యూనికేషన్ రంగానికి మరింత ఊపునిచ్చే జీశాట్-6ఎ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది. జీఎస్ఎల్వీ-ఎఫ్08 రాకెట్ దీనిని కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. బుధవారం మధ్యాహ్నం 1:56 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ నిరంతరాయంగా కొనసాగుతోంది.
ప్రయోగం తర్వాత రాకెట్ 17 నిమిషాల 46 సెకండ్ల పాటు ప్రయాణించి, ఉపగ్రహాన్ని కక్ష్యలో విడిచిపెట్టనున్నట్టు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ తెలిపారు. ఈ ఏడాది మొత్తం పది ఉపగ్రహ ప్రయోగాలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన తెలిపారు. ఏప్రిల్ 12న ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఐ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నట్టు తెలిపారు. కాగా, నేడు ఉపగ్రహ ప్రయోగం నేపథ్యంలో బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శివన్ ఉపగ్రహ నమూనాను స్వామి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు.