Supreme Court: అవినీతిపరులకు సుప్రీం షాక్.. ఆరు నెలలకు మించి స్టే ఇవ్వకూడదని ఆదేశం!
- నేటి నుంచి స్టే ఆర్డర్ రెండు మూడు నెలలకే పరిమితం
- సహేతుకమైన కారణం ఉంటేనే పొడిగింపు
- విచారణలో జాప్యం అన్నది పాలనను దెబ్బతీస్తుంది
అవినీతి, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న నిందితులకు సహేతుకమైన కారణం లేకుండా ఆరు నెలలకు మించి కోర్టులు స్టే ఇవ్వడానికి వీల్లేదంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణం అమలు కానున్నాయి. ఇటువంటి కేసుల విచారణలో జాప్యం జరిగితే అది పాలనపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని, కింది కోర్టులు ఇచ్చే తీర్పులు, విచారణలపై పై కోర్టులు విచక్షణతో, నిగ్రహంతో స్టే ఇవ్వాలని జస్టిస్ ఆదర్శకుమార్ గోయెల్, జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. సమాజంలో అవినీతి కేన్సర్‌లా విస్తరిస్తోందని, ఇటువంటి కేసులను ఉపేక్షించవద్దని పేర్కొన్న కోర్టు, ఒకవేళ స్టే ఇచ్చినా రోజువారీగా సమీక్షించాలని ఆదేశించింది.
సహేతుకమైన కారణం ఉంటే తప్ప ఆరు నెలలకు మించి స్టే ఇవ్వరాదని, స్టే ఆర్డర్‌ను రెండు మూడు నెలలకే పరిమితం చేయాలని పేర్కొన్న కోర్టు, ఈ ఆదేశాలను తక్షణం పాటించాలని ఆదేశించింది. బుధవారం నుంచి స్టే ఆర్డర్లు ఆరు నెలలకే పరిమితమవుతాయని వివరించింది. ఓ అవినీతి కేసులో స్టే ఇచ్చేందుకు హైకోర్టుకు ఉన్న పరిధి గురించి ఢిల్లీ హైకోర్టు ప్రశ్నకు సమాధానంగా సుప్రీం ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.