China: బ్రహ్మపుత్ర నది జలసంబంధ విషయాలను భారత్తో పంచుకునేందుకు చైనా అంగీకారం
- డోక్లాం ఉద్రిక్తతల నేపథ్యంలో సమాచారం పంచుకోవడాన్ని ఆపేసిన చైనా
- ఇరు దేశాల అధికారుల చర్చలతో దిగొచ్చిన చైనా
- సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటామని ప్రకటన
బ్రహ్మపుత్ర నదీజలాలకు సంబంధించిన డేటాను భారత్తో పంచుకోవడాన్ని నిలిపివేసిన చైనా తిరిగి దానిని పునరుద్ధరిస్తున్నట్టు పేర్కొంది. టిబెట్లో డేటా కలెక్షన్ స్టేషన్ అప్గ్రేడేషన్ పేరుతో భారత్తో ఆ డేటాను పంచుకోలేమంటూ గతేడాది చైనా తేల్చి చెప్పింది. తాజాగా ఇరు దేశాలకు చెందిన నీటి వనరుల అత్యున్నత స్థాయి అధికారులు రెండు రోజులపాటు జరిపిన చర్చల అనంతరం బ్రహ్మపుత్ర నదీజలాలకు సంబంధించిన డేటాను భారత్తో పంచుకునేందుకు సిద్ధమైంది. వరదలను అంచనా వేసేందుకు అత్యంత అవసరమైన ఈ డేటాను పంచుకోవడాన్ని చైనా ఆపివేయడంతో అప్పట్లో భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
మానవతా కోణంలో ఆలోచించడంతోపాటు ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచుకునే ఉద్దేశంతో ఈ సమాచారాన్ని భారత్ పంచుకోవాలని నిర్ణయించినట్టు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లుకాంగ్ తెలిపారు.
భారత్-చైనా ఆర్మీ మధ్య గతేడాది 73 రోజులపాటు జరిగిన స్టాండాఫ్ నేపథ్యంలో నదీ జలాల సమాచారాన్ని భారత్తో పంచుకోవడం ఆపేస్తున్నట్టు అప్పట్లో చైనా ప్రకటించింది. అయితే, చైనా పట్టణమైన హాంగ్ఝౌలో రెండు రోజులపాటు ఇరు దేశాల అత్యున్నత స్థాయి అధికారుల మధ్య జరిగిన సమావేశం తర్వాత భారత్తో డేటాను పంచుకోనున్నట్టు చైనా ప్రకటించింది.