Uttar Pradesh: బీఆర్ అంబేద్కర్ పేరులో 'రామ్ జీ'ని చేర్చిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం!
- పేరు మధ్యలో 'రామ్ జీ' ఉండాల్సిందే
- అధికారిక ఉత్తర్వులు జారీ
- ప్రజల దృష్టిని మళ్లించేందుకేనన్న ఎస్పీ
ఉత్తరప్రదేశ్ ను పాలిస్తున్న యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ, మరో వివాదంలో చిక్కుకుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ పేరులో 'రామ్ జీ' పదాన్ని చేర్చాలని స్పష్టం చేసింది. తన అధికార ఉత్తర ప్రత్యుత్తరాల్లో అంబేద్కర్ పేరుకు 'రామ్ జీ' అన్న పదాన్ని చేర్చింది. డాక్టర్ భీమ్ రావ్ రామ్ జీ అంబేద్కర్ అంటూ ఆయన్ను ప్రస్తావించింది.
ఇకపై ఆయన పేరును అధికారికంగా ఎవరు, ఎక్కడ పలకాలన్నా రామ్ జీ పేరును చేర్చాల్సిందేనంటూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఇక ఈ ఆదేశాలపై సమాజ్ వాదీ పార్టీ మండిపడింది. బీజేపీ అంబేద్కర్ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నట్టు విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని సమాజ్ వాదీ నేత దీపక్ మిశ్రా వ్యాఖ్యానించారు. అంబేద్కర్ అంటే బీజేపీకి ఏ మాత్రం గౌరవం లేదని, వారి ఓటు బ్యాంకు కోసమే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు.