NTR: దుర్యోధనుడి వేషంలో వచ్చిన బాలకృష్ణ!
- ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభం
- పౌరాణిక పాత్రలో తొలిషాట్
- హాజరైన వెంకయ్య, తలసాని, కామినేని తదితరులు
హైదరాబాద్ లోని రామకృష్ణా సినీ స్టూడియోస్ లో దివంగత మహానేత ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగా, బాలకృష్ణ హీరోగా తెరకెక్కే 'ఎన్టీఆర్' చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం పలువురు ప్రముఖుల మధ్య అట్టహాసంగా మొదలైంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్, ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తదితరులు హాజరై బాలకృష్ణను అభినందించారు.
ముహూర్తపు షాట్ కోసం బాలకృష్ణ దుర్యోధనుడి వేషంలో వచ్చారు. కిరీటం లేని మేకప్ తో వచ్చిన ఆయన, చుట్టూ తెల్లని శాలువా కప్పుకున్నప్పటికీ, ఆయన మేకప్ ను చూస్తుంటే రారాజు వేషమే గుర్తొస్తోంది. ఇక తొలి షాట్ డైలాగ్, ఎన్టీఆర్ సినిమాల్లోనే అత్యంత ఫేమస్ అయిన దాన వీర శూర కర్ణ లోని "ఏమంటివి ఏమంటివి..." అన్న డైలాగ్ ఉంటుందని తెలుస్తోంది. మరికాసేపట్లో సినిమా అధికారిక ప్రారంభోత్సవం జరుగుతుండగా, డిసెంబర్ నాటికి చిత్రాన్ని పూర్తి చేసి, సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని బాలకృష్ణ భావిస్తున్నట్టు తెలుస్తోంది.