Komatireddy: వద్దంటున్నా వినకుండా... తొలిసారిగా టోల్ గేటు ఫీజు చెల్లించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి!
- శాసన సభ్యత్వాన్ని కోల్పోయిన కోమటిరెడ్డి
- హైదరాబాద్ నుంచి నల్గొండకు ప్రయాణం
- టోల్ గేటు వద్ద ఫీజు చెల్లించిన వైనం
తెలంగాణ బడ్జెట్ సమావేశాల తొలిరోజున గవర్నర్ ప్రసంగిస్తున్న వేళ, జరిగిన పరిణామాలతో సభ తీర్మానం మేరకు ఎమ్మెల్యే పదవిని కోల్పోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హైదరాబాద్, నల్గొండ మధ్య ఉన్న టోల్ గేటు వద్ద తొలిసారిగా తన వాహనానికి ఫీజు చెల్లించారు. ప్రస్తుతం ప్రభుత్వ గన్ మెన్లు కూడా లేని ఆయన 'టీఎస్ 09 ఈఎస్ 7777' నంబరుగల వాహనంలో ప్రయాణిస్తూ, వెంట మరో రెండు వాహనాలతో నల్గొండ వెళుతున్న వేళ టోల్ గేటు దగ్గర ఆపారు.
టోల్ చెల్లించేందుకు ఆయన సిద్ధపడగా, అక్కడున్న సిబ్బంది డబ్బు తీసుకోవడానికి నిరాకరించారు. సాధారణంగా టోల్ గేటుల వద్ద ప్రజా ప్రతినిధుల వాహనాలకు మినహాయింపు ఉంటుంది. కాగా, డబ్బు తీసుకోవాలని కోమటిరెడ్డి మళ్లీ కోరడంతో ఉద్యోగులు డబ్బు తీసుకుని రసీదు ఇచ్చారు. నిత్యమూ ఇదే దారిలో ప్రయాణించే కోమటిరెడ్డి తొలిసారిగా టోల్ ఫీజు చెల్లించడంపై అక్కడున్నవారు చర్చించుకున్నారు.