cbse paper leak: నేనూ తండ్రినే... నాకూ నిద్ర ఉండదు... సీబీఎస్ఈ పేపర్ లీకేజీపై సత్వర విచారణ: కేంద్ర మంత్రి జవదేకర్
- నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న మంత్రి
- పదో తరగతి మ్యాథ్స్, 12వ తరగతి ఎకనమిక్స్ పేపర్ల లీక్
- తిరిగి తర్వాత నిర్వహిస్తామని ప్రకటించిన సీబీఎస్ఈ
సీబీఎస్ఈ పరీక్ష పేపర్ లీకేజీపై సత్వరమే విచారణ జరిపించి, కారకులను అరెస్ట్ చేస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. పేపర్ లీకేజీపై విచారం వ్యక్తం చేశారు. ‘‘ఇది చాలా దురదృష్టకరం. ఈ విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఉండే బాధను అర్థం చేసుకోగలను. పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధ్యులను వదిలిపెట్టే ప్రస్తకే లేదు. నిందితులను పోలీసులు త్వరలోనే అరెస్ట్ చేస్తారు. ఈ విషయంలో నాకూ నిద్ర ఉండదు. ఎందుకంటే నేనూ ఓ తండ్రినే’’ అని మంత్రి చెప్పారు. ఏ ఉల్లంఘనలు జరగకుండా పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
పదో తరగతి మ్యాథ్స్, 12వ తరగతి ఎకనమిక్స్ పేపర్లు లీక్ అయినట్టు గుర్తించడంతో వీటిని తిరిగి నిర్వహిస్తామని సీబీఎస్ఈ నిన్న ప్రకటించింది. కొత్త తేదీలను వారంలోపు వెబ్ సైట్లో ఉంచుతామని తెలిపింది. మరోవైపు ఈ ఘటనలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 25 మందిని ప్రశ్నించారు. గతంలో పేపర్ల లీక్ లకు పాల్పడిన నేరస్థులు, కోచింగ్ సంస్థల యజమానులు, ప్రశ్నా పత్రాలను ముద్రించిన ప్రింటర్ల నిర్వాహకులు ఇందులో ఉన్నారు. నిన్న రాత్రి వరకు 10 ప్రాంతాల్లో సోదాలు కూడా నిర్వహించారు.