IPL 2018: సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్
- వార్నర్ స్థానంలో కేన్ విలియమ్సన్కి చోటు
- సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ నిర్ణయం
- ఏప్రిల్ 7న ముంబై-చెన్నై జట్ల మధ్య తొలి మ్యాచ్
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్‌పై నిషేధం నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తదుపరి కెప్టెన్ ఎవరంటూ కొన్ని గంటల పాటు కొనసాగిన సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్కు కెప్టెన్సీ పగ్గాలు అందిస్తూ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఈ రోజు నిర్ణయం తీసుకుంది. కాగా, బాల్ ట్యాంపరింగ్ వివాదంతో డేవిడ్ వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది నిషేధం విధించడంతో సన్ రైజర్స్ టీమ్ కూడా అతన్ని తమ జట్టు కెప్టెన్‌గా తప్పించింది.
"ఈ సీజన్‌కి సన్ రైజర్స్ టీమ్‌కు కెప్టెన్ పాత్రను నేను అంగీకరిస్తున్నా. నైపుణ్యమున్న ప్లేయర్లతో కూడిన జట్టుకు సారథ్యం వహించే అవకాశం రావడం చాలా బాగుంది. రానున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎదురుచూస్తున్నాను" అని విలియమ్సన్ ఓ ప్రకటనలో తెలిపాడు.
కాగా, ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో తలపడుతున్న ఎనిమిది జట్లకు నాయకత్వం వహిస్తున్న ప్లేయర్లలో ఒక్క విలియమ్సన్ తప్ప మిగిలిన వారంతా టీమిండియా ప్లేయర్లే కావడం గమనార్హం. ఏప్రిల్ 7న ముంబైలోని వాంఖేడి స్టేడియంలో ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది.