Chandrababu: 2019లో నేను చెప్పిన వ్యక్తే ప్రధాని అవుతారు : సీఎం చంద్రబాబు
- టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు
- జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నాం
- విభజన తర్వాత రాష్ట్రం ఎంతగానో నష్టపోయింది
2019లో ప్రధానిని నిర్ణయించబోయేది తానే అంటూ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యానించారు. గుంటూరు టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ 37వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నామని, తాను చెప్పిన వ్యక్తే ప్రధాని అవుతారని అన్నారు. విభజన తర్వాత రాష్ట్రం ఎంతగానో నష్టపోయిందని, రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతోనే నాడు బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని అన్నారు.
టీడీపీ ఏనాడూ హింసా రాజకీయాలు చేయలేదు
తెలుగువారి ఆత్మగౌరవం కాపాడేందుకు నాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, రాజకీయాలతో పేదరిక నిర్మూలన జరగాలనేది ఎన్టీఆర్ ఆశయమని చంద్రబాబు అన్నారు. వెనుకబడిన, బలహీనవర్గాల అభివృద్ధి కోసమే టీడీపీ ఉందని, తెలుగు ప్రజల కోసం నిరంతరం శ్రమించి రుణం తీర్చుకుంటామని, ఏపీ, తెలంగాణలో తమపై గురుతర బాధ్యత ఉందని అన్నారు.
తెలుగుదేశం పార్టీ ఏనాడూ హింసా రాజకీయాలు చేయలేదని, ప్రజాస్వామ్య బద్ధంగానే రాజకీయాలు చేస్తున్నామని అన్నారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆర్థిక అసమానతలు తగ్గిస్తున్నామని, విద్యుత్ రంగంలో రెండోతరం సంస్కరణలు తీసుకొచ్చామని, పోలవరం ప్రాజెక్టును కచ్చితంగా పూర్తి చేసి తీరతామని అన్నారు. రెండంకెల అభివృద్ధికి ఏపీ కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందని చెప్పుకొచ్చారు.