New Delhi: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో గందరగోళం.. మారిపోయిన వందలాది బ్యాగులు!

  • బ్యాగుల్లో పవర్ బ్యాంకులు, లైటర్లు తీసుకెళ్లిన ప్రయాణికులు
  • నత్తనడకన చెక్‌డ్-ఇన్ బ్యాగేజీ 
  • ఆలస్యంగా నడిచిన పలు విమానాలు
  • బాధితుల్లో అఖిలేశ్ యాదవ్, హేమమాలిని

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రయాణికులు తమ బ్యాగుల్లో పవర్ బ్యాంకులు, నిషేధిత వస్తువులు పెట్టుకోవడంతో బ్యాగేజ్ చెకింగ్ నత్తనడకన సాగింది. ఫలితంగా ప్రయాణికుల క్యూ చాంతాడంత పెరిగిపోయింది. అంతేకాదు, చెకింగ్ అనంతరం బ్యాగులు మారిపోవడంతో అధికారులపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు చెక్‌డ్-ఇన్ బ్యాగేజీ ఆలస్యం కావడంతో పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి.

ఈ మొత్తం వ్యవహారాన్ని కొందరు ప్రయాణికులు ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన విస్తారా ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు క్షమాపణ చెప్పింది. అసౌకర్యానికి చింతిస్తున్నట్టు తెలిపింది. బ్యాగేజీ చెకింగ్ విషయంలో ఎయిర్‌పోర్టులో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఆ ప్రభావం విమానాల్లో లగేజీ లోడ్ చేసినప్పుడు పడిందని వివరించింది. కాగా, ఇబ్బంది పడిన ప్రయాణికుల్లో నటి, బీజేపీ ఎంపీ హేమ మాలిని, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కూడా ఉన్నారు.

పవర్ బ్యాంకులు, ఈ-సిగరెట్లు, లిథియమ్ బ్యాటరీలు,  లైటర్లను బ్యాగులలో పెట్టుకోవడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ (డీఐఏఎల్) పేర్కొంది. దీనికి తోడు హాలిడే వీకెండ్ కావడంతో సాధారణం కంటే ప్రయాణికుల రద్దీ 30 శాతం ఎక్కువగా ఉండడంతో బ్యాగేజీ చెకింగ్‌ విషయంలో కొంత అసౌకర్యం ఏర్పడినట్టు వివరించింది.

  • Loading...

More Telugu News