Indian Railway: నిరుద్యోగుల దెబ్బకు రైల్వే షాక్.. అదనంగా 20 వేల పోస్టుల పెంపు!
- 90 వేల ఉద్యోగాలకు 2 కోట్ల దరఖాస్తులు
- కంగుతిన్న రైల్వే అధికారులు
- అదనంగా మరో 20 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటన
దేశంలోని నిరుద్యోగులను చూసి రైల్వే బోర్డుకు మతి తప్పినంత పనైంది. ఏం చేయాలో తెలియక మరో 20 వేల పోస్టులను పెంచింది. ఫలితంగా మరికొంతమందికి నిరుద్యోగులకు ఊరట లభించినట్టు అయింది. రైల్వే నిర్ణయంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైల్వే బోర్డు ఇటీవల 90 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, ఉద్యోగార్థుల నుంచి ఏకంగా రెండు కోట్ల దరఖాస్తులు రావడంతో రైల్వే అధికారులు కంగుతిన్నారు. నిరుద్యోగులకు కొంత మేర అయినా న్యాయం చేయాలనే ఉద్దేశంతో అదనంగా మరో 20 వేల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. దీంతో ఇప్పుడు ఉద్యోగాల సంఖ్య 1.10 లక్షలకు చేరుకుంది.
అదనంగా భర్తీ చేయదలచిన 20 వేల ఖాళీల్లో 9 వేల ఉద్యోగాలను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్పీఎస్ఎఫ్)లలో భర్తీ చేయనున్నారు. మరో పదివేల ఉద్యోగాలను ఎల్-1, ఎల్-2లో కేటగిరీల్లో భర్తీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు.