Heat: ఇవాళ, రేపు ఎండలు చాలా అధికం... హెచ్చరించిన వాతావరణ శాఖ!
- ఉత్తరాది నుంచి వీస్తున్న పొడిగాలులు
- హైదరాబాద్ లో 39 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత
- పెరిగిపోయిన ఎండ తీవ్రత
- హెచ్చరిస్తున్న వాతావరణ శాఖ
ఉత్తరాది రాష్ట్రాల నుంచి పొడిగాలులు వీస్తుండటం, ఆకాశంలో మేఘాల జాడ లేకపోవడంతో నేడు, రేపు సాధారణ స్థాయికన్నా అధికంగా ఉష్ణోగ్రతలను నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం వేళ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సలహా ఇస్తున్నారు. హైదరాబాద్ లో నిన్న ఈ సీజన్ లోనే గరిష్ఠంగా 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, ఆదిలాబాద్, మంచిర్యాల, రామగుండంలతో పాటు ఏపీలోని రెంటచింతల, ఒంగోలు తదితర ప్రాంతాల్లో ఎండ వేడిమి 40 డిగ్రీలను తాకింది. ఈ పరిస్థితి మరో రెండు మూడు రోజులు కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు.
కాగా, మార్చి నెలాఖరులోనే సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా అధికంగా నమోదవుతుండటంతో, ఏప్రిల్, మే నెలల్లో మరింత వేడిని భరించక తప్పదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల అధిక వేడి ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇక ఏప్రిల్ 2వ తేదీ తరువాత ఉరుములు, మెరుపుల, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశాలు ఉన్నాయని, దాంతో కొంత ఉపశమనం లభిస్తుందని అంచనా వేస్తున్నారు.