Jayaprakash Narayan: జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో స్వతంత్ర నిపుణుల బృందం ఏర్పాటు

  • కేంద్ర ప్రభుత్వం హామీలను ఏ మేరకు నెరవేర్చిందో తేల్చడం కోసం ప్రయత్నాలు
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిలా పనిచేయనున్న బృందం
  • వివాదాల పరిష్కారానికి తోడ్పాటునందించే పౌర సమాజంగా కమిటీ

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చట్టపరంగానూ, పార్లమెంటులోనూ ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు నెరవేర్చిందో తేల్చడం కోసం లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో స్వతంత్ర నిపుణుల బృందం ఏర్పాటైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిలా పనిచేస్తూ వివాద పరిష్కారానికి తోడ్పాటునందించే పౌర సమాజంగా వ్యవహరించడం, ఇతరత్రా అంశాలపై అధ్యయనం చేసి పరిష్కారానికి కృషి చేయడం వంటి పనులను నిర్వర్తించడానికి జయప్రకాశ్ నారాయణ ఈ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు హైదరాబాద్‌ అమీర్‌పేట్‌లోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్‌ సోషల్ స్టడీస్ (సెస్) ఆడిటోరియం సెమినార్‌ హాల్‌లో ఈ బృంద తొలి సమావేశం జరిగింది.

అనంతరం జయ ప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా లేక ప్యాకేజీ అమలుకు సాధ్యాసాధ్యాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు, రాష్ట్రంలో పలు జాతీయ సంస్థలు ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, తమ స్వతంత్ర నిపుణుల బృందం వాటిపై కూడా అధ్యయనం చేస్తుందని అన్నారు.

11 జాతీయ స్థాయి సంస్థలు ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం వాటికోసం ఇంతవరకు ఏమి చేసిందో తేల్చుతామన్నారు. ప్రత్యేక హోదాకు సమానమైన సాయం అందాలంటే ఏయే సాయం చేయాలనే అంశంపై కూడా తమ నిపుణుల బృందం అధ్యయనం చేస్తుందన్నారు. ఈ సమావేశంలో రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఆంజనేయ రెడ్డి, రైతు సంఘాల సమాఖ్య సెక్రటరీ జనరల్ చెంగల్‌రెడ్డితో పాటు పలువురు మాజీ ఐపీఎస్‌ అధికారులు, ప్రొఫెసర్లు, ఆర్థిక, న్యాయ రంగాల నిపుణులు పాల్గొన్నారు

  • Loading...

More Telugu News