cbse: కేంద్ర మంత్రి జవదేకర్ ఇంటి వద్ద 144 సెక్షన్ విధింపు
- కలకలం రేపుతున్న సీబీఎస్ఈ పేపర్ లీకేజీ
- సీబీఎస్ఈ కార్యాలయాన్ని ముట్టడించిన ఆందోళనకారులు
- జవదేకర్ ఇంటి వద్ద భద్రత పెంపు
సీబీఎస్ఈ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు, విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ రాజీనామా చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని జవదేకర్ ఇంటి వద్ద భద్రతను పెంచడమే కాకుండా, 144 సెక్షన్ ను విధించారు. 10వ తరగతి మ్యాథ్య్, 12వ తరగతి ఎకనామిక్స్ పేపర్లు లీక్ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు సీబీఎస్ఈ కార్యాలయం ముందు కూడా ఆందోళనకారులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.