YSRCP: అమరావతిలో కూర్చుని అఖిలపక్షం పెడితే లాభం లేదు : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి
- అందరం కలిసి రాజీనామాలు చేద్దాం
- కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే ఏపీకి న్యాయం జరుగుతుంది
- స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం
- టీడీపీ ఎంపీలు రాజీనామా చేయకపోతే లాలూచీ పడ్డట్టే
అమరావతిలో కూర్చుని అఖిలపక్షం పెడితే లాభం లేదని, అందరం కలిసి రాజీనామాలు చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తేనే ఏపీకి న్యాయం జరుగుతుందని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి పెడదామని, రాజకీయాలను పక్కనపెట్టి పోరాడదామని, వ్యక్తిత ప్రయోజనాలు ముఖ్యం కాదని, కలిసికట్టుగా పోరాడితేనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని అన్నారు.
ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటం కీలక దశలో ఉదని, ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చారని అన్నారు. ఏమైనా రాజకీయాలు ఉంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో చూసుకుందామని, ఇప్పుడు మాత్రం ప్రత్యేక హోదా కోసం పోరాడదామని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పదవులు వదులుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, టీడీపీ ఎంపీలు రాజీనామా చేయకపోతే లాలూచీ పడినట్లేనని విమర్శించారు. ముందుగా ప్రకటించినట్టే ఏప్రిల్ 6న తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని, ఆ తేదీ కన్నా ముందే టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసినా తమకు అభ్యంతరం లేదని మిథున్ రెడ్డి అన్నారు.