Andhra Pradesh: ఒంటిమిట్ట రాములోరి కల్యాణంలో విషాదం.. గాలివాన బీభత్సానికి నలుగురి మృతి.. రూ.15 లక్షల చొప్పున పరిహారం ప్రకటన
- ఒంటిమిట్టలో గంటపాటు భారీ వర్షం
- రాకాసి గాలులకు కూలిన టెంట్లు.. ఎగిరిపడిన రేకులు
- వందమందికిపైగా గాయాలు
- రిమ్స్‌లో క్షతగాత్రులను పరామర్శించిన ముఖ్యమంత్రి
- పరిహారం ప్రకటన
ఒంటిమిట్ట సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవంలో ప్రకృతి బీభత్సం కారణంగా అపశ్రుతి చోటుచేసుకుంది. అకాల వర్షం, పెను గాలుల బీభత్సానికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వందమందికిపైగా గాయపడ్డారు. అన్ని దేవాలయాల్లా కాకుండా ఈ ఆలయ సంప్రదాయం ప్రకారం శ్రీరామ నవమి తర్వాత పున్నమి రాత్రి వేళ ఇక్కడ కల్యాణం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శుక్రవారం కల్యాణం నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం ప్రత్యేకంగా మూడు గ్యాలరీలను నిర్మించారు. భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు.
రాత్రి 8 గంటలకు కల్యాణం నిర్వహించాల్సి ఉండడంతో సాయంత్రం 6 గంటల నుంచే భక్తులను అనుమతించారు. భక్తులతో గ్యాలరీలన్నీ నిండిపోయాయి. అదే సమయంలో ప్రకృతి కన్నెర్ర చేసింది. రాకాసి గాలుల రూపంలో విరుచుకుపడింది. ఉరుములు, మెరుపులతో గాలి వాన మొదలైంది. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో చీకట్లు కమ్ముకున్నాయి. గంటకుపైగా భారీ వర్షం కురిసింది. పెనుగాలులకు గ్యాలరీ కూలి దాని రేకులు, ఇనుప కమ్మీలు భక్తులపై పడడంతో ముగ్గురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు విడిచారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరో వందమందికిపైగా భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఏడుగురు పోలీసులు ఉన్నారు.
ఒంటిమిట్ట స్వామి వారి కల్యాణోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పాల్గొనాల్సి ఉండగా వర్షం కారణంగా కదలలేక చాలాసేపు కడప ఆర్ ఆండ్ బీ గెస్ట్ హౌస్‌లోనే ఉండిపోయారు. వర్షం తగ్గిన తర్వాత రాత్రి 9 గంటల సమయంలో ఒంటిమిట్ట చేరుకుని స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం కడపలోని రిమ్స్ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.15 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.3 లక్షలు, గాయపడిన వారికి లక్ష రూపాయల పరిహారం ఇవ్వనున్నట్టు ప్రకటించారు.