Indian Railways: నిరుద్యోగ భారతం: లక్షా పదివేల రైల్వే ఉద్యోగాలకు రెండు కోట్లకు పైగా దరఖాస్తులు!

  • లక్షా పదివేల ఉద్యోగాలకు రెండు కోట్లకు పైగా దరఖాస్తులు
  • త్వరలో మరో 9 వేల ఆర్పీఎఫ్, ఆర్పీఎస్‌ఎఫ్‌ ఉద్యోగాల భర్తీ
  • దరఖాస్తుల దాఖలుకు నేటితో ముగియనున్న తుది గడువు

దేశంలో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతుందనడానికి ఇదో ఉదాహరణగా నిలుస్తుంది. త్వరలో 1,10,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. తొలుత ప్రకటించిన 90 వేల ఉద్యోగాల భర్తీకి గతనెల ప్రకటన కూడా విడుదల చేసింది. తాజాగా మరో 20 వేల ఉద్యోగాలను కూడా భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

రైల్వేలు చేసిన ఈ భారీ భర్తీ ప్రకటనకు దేశవ్యాప్తంగా నిరుద్యోగుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఆ స్పందన తెలిస్తే కచ్చితంగా మీరు ముక్కున వేలేసుకుంటారు. ఈ ఉద్యోగాలకు ఇప్పటివరకు దాదాపు 2.12 కోట్లకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు రైల్వే సీనియర్ అధికారి ఒకరు మీడియాకి తెలిపారు.

దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ నేటితో ముగుస్తుంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆయన చెప్పారు. మరోవైపు రైల్వే భద్రతా దళం (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్-ఆర్పీఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్పీఎస్‌ఎఫ్) విభాగాల్లోనూ త్వరలో మరో 9 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని రైల్వే శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి మే నెలలో ప్రకటన విడుదలయ్యే అవకాశమున్నట్లు తెలిసింది. వీటికి తోడు ఎల్-1, ఎల్-2 కేటగిరీల్లో మరో పదివేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కూడా రైల్వే శాఖ తెలిపింది. కాగా, ఫిబ్రవరి 19న అన్ని విభాగాల అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని రెండేళ్లు సడలించిన సంగతి తెలిసిందే. రైల్వేల్లో ప్రస్తుతం 13.5 లక్షల మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు.

  • Loading...

More Telugu News