amit shah: ఎలాంటి పొత్తులు ఉండవు.. అధికారం మాదే: అమిత్ షా
- కర్ణాటకలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం
- అవినీతితో కన్నడిగులు విసిగిపోయారు
- లింగాయత్ లకు మైనార్టీ హోదా ఇవ్వడం ఓ కుట్ర
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు పెట్టుకోబోమని, ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని... సింగిల్ గానే అధికారంలోకి వస్తామని తెలిపారు. కొన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ... బీజేపీ గట్టి పోటీ ఇస్తుందని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నాడి తెలుసుకుంటున్నానని... అవినీతితో వారు విసిగిపోయారని, అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు. అవినీతి లేకుండా కాంగ్రెస్ ఉండలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సరిగా లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో కూడా సిద్ధరామయ్య ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. లింగాయత్ లకు మైనార్టీ హోదా ఇవ్వడం ఓ రాజకీయ కుట్ర అని... లింగాయత్ ఓట్లను చీల్చేందుకే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి రాజకీయాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.