Jana Sena: పవన్ కల్యాణ్ 'జనసేన' సభ్యత్వం కోసం ప్రత్యేక యాప్
- జనసైన్యం పేరుతో సభ్యత్వ నమోదు
- మిస్డ్ కాల్‌తో పార్టీ సభ్యులుగా చేరిన 17 లక్షల మంది
- యువతే అధికం
- 40 శాతం మంది వాలంటీర్లుగా సేవ చేసేందుకు సుముఖత
జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కోసం ప్రత్యేకంగా యాప్ సిద్ధం చేశారు. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ మహాసభలో మిస్డ్ కాల్ తో పార్టీ సభ్యులుగా చేరవచ్చని ప్రకటించిన తరవాత ఇప్పటికి 17 లక్షల మందికి పైగా చేరారని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. మిస్డ్ కాల్ తో చేరడంతో పాటు ప్రత్యేక యాప్ ద్వారా జన సైన్యం చేసే కార్యక్రమాల వివరాలను జనసేన ఐటీ విభాగం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో వివరించింది.
జనసేన ప్రతినిధి విజయ నిర్మల మాట్లాడుతూ.. 'నిజాయతీగల రాజకీయాలతో పటిష్ఠమైన పౌర సమాజం నిర్మించేందుకు జనసేన కట్టుబడి ఉంది. పార్టీ దార్శనికతను విశ్వసించే ప్రతి ఒక్కరినీ సభ్యులుగా చేర్చుకుంటాం. వీరిలో యువత ఎక్కువగా ఉంది. చేరిన వారిలో 40 శాతం మంది పార్టీకి వాలంటీర్లుగా సేవ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. యాప్ ద్వారా సభ్యత్వ నమోదు ప్రక్రియ మరింత సులభం అవుతుంది. జనసైన్యం పేరుతో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది' అని చెప్పారు.
ఐటీ విభాగం తరఫున శ్రీనివాస్ మిరియాల మాట్లాడుతూ.. '93940 22222 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు సభ్యులు కావచ్చు. వారి ఫోన్ కి యూనిక్ మెంబర్ షిప్ ఐడీ వస్తుంది. మెంబర్ షిప్ వెబ్ సైట్ లోకి లాగిన్ కావడానికి ఒక లింక్ కూడా పంపిస్తాం. తమ ఫోటో, ఎంపిక చేసుకున్న భాషలో ఈ-మెంబర్ షిప్ కార్డు కూడా తీసుకోవచ్చు. ఈ ప్రక్రియ ఒక నిమిషం కంటే తక్కువ వ్యవధిలో పూర్తవుతుంది. పార్టీ కోసం వారు ఎక్కడ, ఎలాంటి పని చేయదలచుకున్నారో కూడా తెలియజేసే వెసులుబాటు అందులో ఉంటుంది. పార్టీ వాలంటీర్లు తమ చుట్టుపక్కల వారిని సభ్యులుగా నమోదు చేసే యాప్ ద్వారా ఏప్రిల్ 2 వ తేదీ నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నాం' అని అన్నారు.
జనసేన నేత కులదీప్ మాట్లాడుతూ... 'జనసేన సభ్యులు వివిధ అంశాలను చర్చించుకొనేందుకు పలు డిజిటల్ వేదికలు సిద్ధం చేస్తున్నాం. జనసేవక్స్ అనే డిజిటల్ వేదికను త్వరలో కార్యకర్తల ముందుకు తీసుకువస్తాం. జనసేన సభ్యులతో తమ చుట్టూ ఉన్న సమస్యలపై ప్రజలు చర్చించేందుకూ ప్రత్యేకంగా ఓ డిజిటల్ వేదిక తీసుకువస్తాం' అని చెప్పారు.