hyderabad central university: హెచ్ సీయూ వైస్ ఛాన్సలర్ హత్యకు మావోయిస్టుల కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు!
- రోహిత్ వేముల ఘటనకు ప్రతీకారంగా హత్యకు కుట్ర
- చంద్రన్న దళం ఆదేశాలతో పథక రచన
- తనకు ఎలాంటి బెదిరింపులు రాలేదన్న అప్పారావు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సెలర్ అప్పారావును హత్య చేసేందుకు మావోయిస్టులు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. భద్రాచలం-చర్ల రోడ్డుపై పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా పృథ్వీరాజ్, చంద్రన్ మిశ్రా అనే వ్యక్తులు పోలీసులకు చిక్కారు. వీరిని అదుపులోకి తీసుకుని, విచారించగా అప్పారావు హత్యకు కుట్ర పన్నిన విషయం వెలుగు చూసింది.
రోహిత్ వేముల ఆత్మహత్యకు ప్రతీకారంగానే అప్పారావును చంపాలని మావోయిస్టులు నిర్ణయించారని చెప్పారు. చంద్రన్న దళం సెంట్రల్ కమిటీ సభ్యుడు హరిభూషన్ ఆదేశాలతో ఈ హత్యకు పథక రచన చేసినట్టు వారు తెలిపారు. కోల్ కతాకు చెందిన చందన్ మిశ్రా హెచ్ సీయూలో ఎంఏ చదువుతున్నాడు. పృథ్వీరాజ్ కృష్ణా జిల్లా కేసరిపల్లి వాసి అని జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు.
మరోవైపు ఈ ఘటనపై వీసీ అప్పారావు స్పందించారు. తనకు ఇంతవరకు ఎలాంటి బెదిరింపులు రాలేదని ఆయన చెప్పారు. తనను చంపడానికి ఎవరు కుట్ర చేశారో కూడా తెలియదని అన్నారు. పోలీసులు కూడా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పారు. ప్రస్తుతం హెచ్ సీయూ చాలా ప్రశాంతంగా ఉందని తెలిపారు.