YSRCP: ఆ ఏడు నెలలూ గాడిదలు కాశావా?: చంద్రబాబుకు జగన్ సూటి ప్రశ్న
- ఏడు నెలల పాటు ప్లానింగ్ కమిషన్ వద్ద హోదా ఫైల్
- అప్పుడు అడగని చంద్రబాబు ఇప్పుడు విమర్శిస్తున్నాడు
- ప్రజలను మోసం చేయడమే ఆయన పని
- గుంటూరు జిల్లాలో వైఎస్ జగన్
2014 మార్చి 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొడితే, ఆపై జూన్ లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారని, ఆపై డిసెంబర్ వరకూ ఏడు నెలల పాటు ప్రత్యేక హోదా ఫైల్ ప్రణాళికా సంఘం వద్ద ఉన్నదని గుర్తు చేసిన వైఎస్ జగన్, ఆ ఏడు నెలల కాలం పాటు చంద్రబాబునాయుడు హోదా గురించి ప్రశ్నించకుండా గాడిదలు కాస్తున్నాడా? అని ప్రశ్నించారు.
గుంటూరు జిల్లా పేరేచర్ల సమీపంలో పాదయాత్ర చేస్తున్న ఆయన, అసంఖ్యాక ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సీఎం హోదాలో ఉండి కూడా హోదా గురించి ఒక్క మాట కూడా అడగలేదని, ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేయడం కాదా? అని నిప్పులు చెరిగారు. హోదా స్థానంలో జైట్లీ ప్యాకేజీని ప్రకటించిన వెంటనే చంద్రబాబు ఎందుకు పోరాటాన్ని ప్రారంభించలేదని ఆయన అడిగారు. జైట్లీ తొలిసారి చేసిన ప్రకటనకు, చంద్రబాబు తన మంత్రులను రాజీనామా చేయించడానికి ముందు చేసిన ప్రకటనకూ తేడాలేదని, అప్పుడు జైట్లీకి సన్మానాలు చేసిన పెద్దమనిషి, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసమే విమర్శించడం ప్రారంభించారని అన్నారు.
తాను హోదా కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగిన వేళ, దాన్ని భగ్నం చేయించాడని, తాను నాలుగేళ్లుగా పోరాటం చేస్తుంటే, దాన్ని నీరుగారుస్తూ వచ్చిన చంద్రబాబు, హోదా కావాలని నినదించే విద్యార్థులపై పీడీ చట్టం కింద కేసులు పెడతానని బెదిరించారని, అది నిజం కాదా? అని ప్రశ్నించారు. తాము అవిశ్వాస తీర్మానాన్ని పెట్టకుంటే, చంద్రబాబు ఆ ఊసే ఎత్తేవాడు కాదని ఎద్దేవా చేసిన జగన్, ఈ విషయంలో కూడా గంటల వ్యవధిలో చంద్రబాబు యూ-టర్న్ తీసుకున్నారని నిప్పులు చెరిగారు.
ఉద్యమాలతోనే హోదా వస్తుందని, ఓ గజదొంగే వచ్చి దొంగతనాల నివారణ కోసం సలహాలు చెప్పాలంటూ సమావేశం పెట్టినట్టు, అఖిలపక్షం మీటింగ్ పెట్టారని, అందుకే తాము వెళ్లలేదని అన్నారు. ఎంపీలంతా ఏకతాటిపై నిలిస్తే హోదా వస్తుందని, ఆ పని చేస్తే ఎక్కడ అరెస్ట్ చేసి జైల్లో పెడతారోనన్న భయం చంద్రబాబులో ఉందని విమర్శలు గుప్పించారు.