Bihar: బీహర్ లో గొడవలు పెడుతున్న బీజేపీ... సంచలన ఆరోపణలు చేసిన నితీశ్ కుమార్
- హింసకు కేంద్ర మంత్రి అశ్వనీ చౌబే కుమారుడే కారణం
- ఆయన ర్యాలీ తరువాతనే అల్లర్లు
- ఆరోపించిన నితీశ్ కుమార్
శ్రీరామనవమి పర్వదినం అనంతరం బీహార్ లో చెలరేగిన హింసకు బీజేపీ నేతలే కారణమని సీఎం నితీశ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. మత కల్లోలాల వెనుక బీజేపీ నేత అర్జిత్ శషావత్ ఉన్నారని, ఆయనకు వ్యతిరేకంగా ప్రభుత్వం వద్ద సాక్ష్యాలు ఉండటంతో యాంటిసిపేటరీ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారని ఆరోపించారు.
కేంద్ర మంత్రి అశ్వనీ చౌబే కుమారుడైన అర్జిత్, బీహార్ లో యువ బీజేపీ నేతగా ఎదుగుతున్నారు. మార్చి 17న భాగల్ పూర్ ప్రాంతంలో పోలీసుల అనుమతి లేకుండా ఊరేగింపు ప్రారంభించిన అర్జిత్, గొడవలకు ప్రధాన కారణం అయ్యాడని నితీశ్ తెలిపారు. ఆపై మరిన్ని ప్రాంతాలకు అల్లర్లు విస్తరించాయని అన్నారు. కాగా, రాష్ట్రంలో మత కల్లోలాలకు కారణం అర్జిత్ శషావత్ అని, ఆయనకు బెయిల్ ఇవ్వవద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్ఎన్ షా కోర్టుకు తెలుపగా, అర్జిత్ ను అరెస్ట్ చేయమని న్యాయమూర్తి ఆదేశించారు.