TTD: తిరుమలలో ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడనంత రద్దీ!
- కలిసొచ్చిన వారాంతపు సెలవులు, తుంబుర ముక్కోటి
- కిటకిటలాడిన తిరుమల గిరులు
- ఐదు గంటల్లోనే ముగిసిన దివ్యదర్శనం కోటా
- రెండు కిలోమీటర్లకు పైగా క్యూలైన్
ఓవైపు పరీక్షలు ముగియడం, మరోవైపు వారాంతపు సెలవుల నేపథ్యంలో తిరుమల గిరులు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా కిటకిటలాడుతున్నాయి. ఈ ఉదయం సర్వ దర్శనం నిమిత్తం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ను దాటి 2 కిలోమీటర్ల పొడవున యాత్రికులు బారులుతీరారు. క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లూ నిండగా, ఇప్పుడు క్యూలైన్ లోకి ప్రవేశించిన వారికి దర్శన సమయం 15 నుంచి 18 గంటల సమయం పట్టవచ్చని టీటీడీ ప్రకటించింది. తుంబుర ముక్కోటి కూడా కలసి రావడంతో కాలినడకన వస్తున్న యాత్రికుల సంఖ్య అత్యధికంగా ఉండగా, అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమైన 20 వేల దివ్యదర్శనం టోకెన్ల కోటా, నేటి తెల్లవారుజాముకే అయిపోయాయి.
గదుల కొరత అధికంగా ఉండటంతో, భక్తులు ఆరు బయటే విశ్రమించాల్సిన పరిస్థితి. దీనికితోడు నిన్న సాయంత్రం తిరుమలలో ఉరుములు, మెరుపులతో వర్షం కురియగా, భక్తులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ రద్దీ మరో నాలుగైదు రోజుల పాటు కొనసాగనుందని అంచనా వేస్తున్నామని, భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. కాగా, తిరుమల శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు శనివారంతో ముగిశాయి. ముగింపు వేడుకల్లో భాగంగా, మలయప్పస్వామి, శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ విగ్రహాలకు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.