KTR: మా నాన్న కేసీఆర్ మంచి గాయకుడు!: కేటీఆర్
- కాలేజీ రోజుల్లో బహుమతులు కూడా వచ్చాయి
- ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి కేసీఆర్ అభిమాని
- ఆసక్తికర ప్రసంగం చేసిన కేటీఆర్
తన తండ్రి కేసీఆర్ స్వతహాగా గాయకుడని, కాలేజీలో చదువుతున్న రోజుల్లో పాటలు పాడి బహుమతులు కూడా గెలుచుకున్నారని తెలంగాణ ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. స్పర్శ్ ఆసుపత్రికి చేయూతను ఇచ్చేందుకు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో సంగీత విభావరి జరుగగా, కేటీఆర్ పాల్గొని ఆసక్తికర ప్రసంగం చేశారు.
కేసీఆర్ బాల సుబ్రహ్మణ్యానికి ఎంతో పెద్ద అభిమానని తెలిపారు. ఆయన పాటలు పాడుతూ ఉంటే స్వయంగా చూడటం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో బిజీగా ఉండే తనకు తరచూ పాటలు వినే అవకాశం దక్కదని చమత్కరించిన కేటీఆర్, బాలూ పాటలు విని మైమరచిపోయానని అన్నారు. స్పర్శ్ ఆసుపత్రికి ఇప్పటికే తమ ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిందని గుర్తు చేసిన ఆయన, నిర్మాణ అనుమతుల విషయంలోనూ మినహాయింపులు ఇచ్చి ప్రోత్సహిస్తామని తెలిపారు.