NIMS: అలా చేయకుంటే విధులు బహిష్కరిస్తాం..నిమ్స్ వైద్యుల హెచ్చరిక
- వైద్యుడు శివతేజ మృతిపై న్యాయ విచారణ జరిపించాలి
- అతని మృతిపై మాకు అనుమానాలున్నాయ్
- పక్షం రోజుల్లో నివేదిక సమర్పించాలి..కారకులను కఠినంగా శిక్షించాలి
- నిమ్స్ ఆసుపత్రి ఆవరణలో ర్యాలీ చేపట్టిన వైద్యులు
గతనెల 25న పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రి నివాస సముదాయంలో చోటుచేసుకున్న వైద్యుడు శివతేజ రెడ్డి (31) అనుమానాస్పద మృతి ఘటనపై న్యాయ విచారణ జరిపించి, కారకులను కఠినంగా శిక్షించాలని, లేదంటే విధులను బహిష్కరిస్తామని వైద్యులు ఈ రోజు హెచ్చరించారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ వారు ఆసుపత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు.
ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ చేపట్టారు. శివతేజ మృతిపై తమతో పాటు సిబ్బందికి కూడా అనుమానాలున్నాయని వారు ఈ సందర్భంగా తెలిపారు. అందువల్ల అనుమానాలు తొలగిపోవాలంటే న్యాయ విచారణ కమిటీతో విచారణ జరిపించి పక్షం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రతిభావంతుడైన ఓ మంచి వైద్యుడ్ని కోల్పోయామని వారు ఈ సందర్భంగా విచారం వ్యక్తం చేశారు. గతనెల 25న శివతేజ రెడ్డి అనుమానాస్పద రీతిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.