ISRO: ఇస్రోతో జీశాట్-6ఏ కనెక్షన్ కట్...ఆందోళనలో శాస్త్రవేత్తలు
- చివరగా మార్చి 30న ఉదయం 9.22 గంటలకు జీశాట్-6ఏ నుంచి సమాచారం
- మూడో లామ్ ఇంజిన్ను మండించినప్పటి నుంచి అనుసంధానం కట్
- రెండు రోజుల కిందట జీశాట్-6ఏ ప్రయోగం సక్సెస్
రెండు రోజుల కిందట భారత్ విజయవంతంగా ప్రయోగించిన అధునాతన ఉపగ్రహం 'జీశాట్-6ఏ'తో సంబంధాలు కోల్పోయినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అధికారులు వెల్లడించారు. దాని నుంచి ఎలాంటి సమాచారం అందడం లేదని వారు చెప్పారు. ఉపగ్రహంతో అనుసంధానం కావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు తెలిపారు. ఈ ఉపగ్రహానికి సంబంధించి చివరిదైన మూడో లామ్ ఇంజిన్ను మండించినప్పటి నుంచి దానితో అనుసంధానం కోల్పోయామని ఇస్రో తన అధికారిక వెబ్సైటులో పేర్కొంది.
చివరగా మార్చి 30న ఉదయం 9.22 గంటలకు దాని నుంచి సమాచారం అందిందని తెలిపింది. మొదటిసారి కక్ష్య పెంపు ప్రక్రియ చేపట్టిన సమయంలో అది సమాచారాన్ని చేరవేసిందని పేర్కొంది. మార్చి 31న రెండోసారి కక్ష్య పెంపు ప్రక్రియను చేపట్టినట్లు తెలిపింది. కాగా, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన జీశాట్-6ఏ ఉపగ్రహాన్ని గురువారం విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే.