Bharath Bandh: రేపు 'భారత్ బంద్‌'కు పిలుపునిచ్చిన దళిత సంఘాలు

  • ఎస్సీ/ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా నిర్ణయం
  • వద్దని వారిస్తున్న కేంద్ర ప్రభుత్వం
  • కోర్టు తీర్పు చట్టం సమర్థతను దెబ్బతీసేలా ఉందని ఆరోపణ

ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా పలు దళిత సంఘాలు రేపు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ పిలుపును తొలుత సంవిధాన్ బచావో సంఘర్ష్ కమిటీ అనే దళిత గ్రూపు ఇచ్చింది. తర్వాత ఆల్ ఇండియా ఆది ధరమ్ మిషన్, ఆల్ ఇండియా ఆది ధరమ్ సాధు సమాజ్‌లు ఈ బంద్‌కు తమ వంతు మద్దతు తెలిపాయని 'ది టైమ్స్ ఆఫ్ ఇండియా' వార్తా పత్రిక తెలిపింది. మరోవైపు ప్రభుత్వం మాత్రం సమ్మె వద్దని ఆయా సంఘాలను కోరుతోంది. ఎస్సీ/ఎస్టీల అభ్యున్నతికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి థవర్‌చాంద్ గెహ్లాట్ ట్విట్టర్‌ ద్వారా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ కూడా ప్రభుత్వం వేయనుందని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, ఈ చట్టం కింద తక్షణ అరెస్టులు చేయడం, క్రిమినల్ కేసులు నమోదు చేయడం సరికాదని సుప్రీంకోర్టు ఇటీవల తన తీర్పులో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ చట్టం కింద ఏదైనా కేసు నమోదు చేయాలంటే జరిగిన సంఘటనపై డీఎస్పీ స్థాయి అధికారి దర్యాప్తు తప్పనిసరిగా ఉండాలని, ఎవరైనా ప్రభుత్వాధికారులను అరెస్టు చేయాలంటే ముందస్తు అనుమతి ఉండాలంటూ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పును విపక్ష కాంగ్రెస్‌ సహా దళిత సంఘాలు, ఎన్డీయేలోని పలువురు దళిత ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ఎస్సీ/ఎస్టీ చట్టం సమర్థతను దెబ్బతీసే విధంగా ఉందని వారు ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News