USA: నేటి నుంచే హెచ్1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ.. నిబంధనలు కఠినమే!
- చిన్న తప్పులను కూడా ఉపేక్షించబోమని ప్రకటన
- ఎక్కువ దరఖాస్తులు తిరస్కరణకు గురికావచ్చన్న ఆందోళన
- 65,000 వీసాల కోటా
అమెరికాలో ఉద్యోగం చేయాలని ఆశించే నిపుణులు హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు సమయం రానే వచ్చింది. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలు కానుంది. మన దేశం నుంచి ఎక్కువ మంది ఈ వీసాపై అమెరికాలో ఉద్యోగం చేసేందుకు వెళుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సారి ట్రంప్ సర్కారు దరఖాస్తుల ప్రక్రియ, వడపోత విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని మార్గదర్శకాలు చూస్తేనే తెలుస్తోంది.
చిన్న లోపాలు ఉన్నా సహించబోమని ఈ ప్రక్రియను చూసే అమెరికా పౌర, వలసల విభాగం (యూఎస్ సీఐఎస్) హెచ్చరించడం ఇందుకు నిదర్శనం. దీంతో ఈ ఏడాది ఎక్కువ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. 65,000 వార్షిక వీసాల జారీ కోటా అమలవుతుంది. 20,000 వీసాలను అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ లేదా ఉన్నత విద్య చేసిన వారికి కేటాయించారు. గరిష్ట పరిమితి కోటాతో సంబంధం లేకుండా వీరికి వీసాల జారీ ఉంటుంది.