Jagan: ప్రత్యేక హోదా సాధనకై కార్యాచరణను ప్రకటించిన వైయస్ జగన్!

  • యువత ఉద్యోగాలకు ప్రత్యేక హోదా పర్యాయపదం
  • కేంద్రానికి వ్యతిరేకంగా యూనివర్శిటీల్లో నిరసన చేపట్టాలి
  • టీడీపీ ఎంపీల చేత చంద్రబాబు రాజీనామా చేయించాలి

ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ తన పోరాటాన్ని ఉద్ధృతం చేసింది. పార్లమెంటు సమావేశాల్లో హోదాపై ప్రకటన రాకుంటే... సమావేశాల చివరి రోజున వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత జగన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. యువత ఉద్యోగాలకు ప్రత్యేక హోదా అనేది పర్యాయపదమని ఆయన ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదాను ఇవ్వకుండా ఏపీకి అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూనివర్శిటీ ప్రాంగణాలలో విద్యార్థులు నిరసన కార్యక్రమాలను చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం, మండలం, జిల్లా స్థాయుల్లో విద్యార్థులు, వైసీపీ నేతలు కలసి రిలే నిరాహారదీక్షలు చేపట్టాలని అన్నారు.

ప్రత్యేక హోదా అనేది మన హక్కు అని జగన్ చెప్పారు. పార్లమెంటు సమావేశాలు నిరవధిక వాయిదా పడిన వెంటనే వైసీపీ ఎంపీలంతా రాజీనామాలు చేస్తారని... ఆ తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్ లో నిరవధిక నిరాహారదీక్షను చేపడతారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, యువత భవిష్యత్తు కోసం టీడీపీ ఎంపీల చేత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేయించాలని కోరారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పారు.

  • Loading...

More Telugu News