secunderabad railway station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రైవేటు పరం... నిర్వహణ సేవలు అప్పగించేందుకు రంగం సిద్ధం
- 15 ఏళ్ల పాటు ప్రైవేటు సంస్థల నిర్వహణకు
- స్టేషన్ల నిర్వహణ మాత్రమే ప్రైవేటు వారికి
- బిడ్లను ఆహ్వానించి అర్హులను ఎంపిక చేయనున్న ఐఆర్ సీడీసీ
- సికింద్రాబాద్ తో పాటు బెంగళూరు, పుణె తదితర స్టేషన్లు అవుట్ సోర్స్ కు
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ రైల్వే ష్టేషన్ ప్రైవేటు పరం కానుంది. స్టేషన్ నిర్వహణ సేవలను అవుట్ సోర్సింగ్ చేసేందుకు ఆ శాఖ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ తో పాటు బెంగళూరు, ఢిల్లీ ఆనంద్ విహార్, పుణె, చండీగఢ్ రైల్వే స్టేషన్లను కూడా ప్రైవేటు వారికి అవుట్ సోర్స్ చేసేందుకు నిర్ణయం జరిగింది.
ప్రధానంగా స్టేషన్ల ద్వారా ఆదాయం పెంపుపై ఆ శాఖ దృష్టి సారించింది. ఒకవైపు ఆదాయం పెంచుకోవడం, మరోవైపు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే ఈ నిర్ణయంలోని అంతరార్థమని రైల్వే శాఖ పేర్కొంది. అయితే, ఈ చర్యతో స్టేషన్ల ప్లాట్ ఫామ్ టికెట్ల ధరలు, స్టేషన్లలోని దుకాణాల్లో ధరలు మండిపోయే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే ప్రైవేటు సంస్థలు మరింత మెరుగ్గా నిర్వహించేందుకు వీలుగా పెట్టుబడులు పెడతాయి. దాంతో అధిక ఆదాయం తెచ్చుకునేందుకు చార్జీల పెంపు కచ్చితంగా వుంటుంది.
తొలుత ఈ స్టేషన్లను 15 ఏళ్ల పాటు అవుట్ సోర్సింగ్ చేస్తారు. రైల్వే శాఖకు చెందిన ఐఆర్ సీడీసీ బిడ్లను ఆహ్వానించి అర్హులైన సంస్థలకు నిర్వహణ బాధ్యతలు కట్టబెడుతారు. స్టేషన్లలోని దుకాణాలు, ప్లాట్ ఫామ్ టికెట్లు, పార్కింగ్, ప్రకటనల బోర్డులు వంటి సేవలు ప్రైవేటుకు వెళతాయి. రైళ్ల రాకపోకలు, రైల్వే సిగ్నల్, ఇంజనీరింగ్, ట్రాక్ లు తదితర కీలక సేవలన్నీ రైల్వేనే చూస్తుంది.