hero motocorp sales: టూ వీలర్లలో హీరో... ప్రతి నిమిషానికి 14 వాహనాలు... ఏడాదిలో 75 లక్షల అమ్మకాలు
- విక్రయాల పరంగా ప్రపంచ రికార్డు
- 2020 నాటికి కోటి విక్రయాలను సాధిస్తామన్న కంపెనీ
- కొత్త మోడళ్లను తీసుకురానున్నట్టు ప్రకటన
ద్విచక్ర వాహనాల విక్రయాల్లో దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉన్న హీరో మోటో కార్ప్... నిజంగానే హీరో అనిపించుకుంది. మార్చితో ముగిసిన 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ ఏకంగా 75 లక్షల వాహనాలను అమ్మింది. ఈ లెక్కన ప్రతి నిమిషానికి 14 వాహనాలు అమ్ముడుపోయాయి. కంపెనీ చరిత్రలో ఇదొక నూతన మైలురాయి. అంతేకాదు, ఈ స్థాయి అమ్మకాలను నమోదు చేసిన తొలి కంపెనీ ప్రపంచంలో తమదేనని హీరో మోటో కార్ప్ ప్రకటించుకుంది. అంతకుముందు సంవత్సరం (2016-17)లో హీరో మోటో కార్ప్ 66.6 లక్షల బైకులు, స్కూటర్లను విక్రయించింది.
‘‘ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో మూడు రోజులు మిగిలి ఉండగానే మార్చి 28 నాటికి ప్రపంచ రికార్డు నమోదైంది. 75 లక్షల యూనిట్ల విక్రయాలను కంపెనీ అధిగమించింది’’ అని హీరో మోటోకార్ప్ ఉన్నతోద్యోగి ఒకరు తెలిపారు. 2020 నాటికి కోటి వాహన విక్రయాల లక్ష్యాన్ని సాధిస్తామని పేర్కొన్నారు. విక్రయాలు పెంచుకునే వ్యూహంలో భాగంగా ఎక్స్ ట్రీమ్ 200ఆర్, ఎక్స్ పల్స్, డ్యుయెట్ 125, మాస్ట్రో ఎడ్జ్ 125 మోడళ్లలో కొత్తవి తీసుకురానున్నట్టు హీరో మోటోకార్ప్ తెలిపింది. ప్రీమియం విభాగంపై, స్కూటర్లపై దృష్టిని పెంచడం ద్వారా వృద్ధిని కొనసాగిస్తామన్న నమ్మకాన్ని కంపెనీ ఎండీ, సీఈవో పవన్ ముంజాల్ వ్యక్తం చేశారు.