Maharashtra: డీఎన్ఏ మ్యాచ్ కాకపోవడంతో... రెండేళ్ల శిక్ష అనుభవించిన తరువాత నిర్దోషిగా విడుదలవుతున్న యువకుడు!
- వికాస్ అత్యాచారం చేశాడని ఆరోపించిన మైనర్ బాలిక
- అతనికి ఏడేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయస్థానం
- డీఎన్ఏ రిపోర్ట్ వేరవడంతో నిర్దోషిగా విడుదల
అత్యాచారం చేశాడన్న ఆరోపణలతో ఏడేళ్ల కారగార శిక్ష పడిన నిందితుడు రెండేళ్ల శిక్ష తరువాత నిర్దోషిగా నిరూపితమైన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... భివాండీకి చెందిన మైనర్ బాలిక, ప్రేమ పేరుతో వికాస్ మాలి అనే యువకుడు తనపై అత్యాచారానికి పాల్పడి, తనను మోసం చేశాడని, దీంతో తాను గర్భందాల్చానని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతనిపై ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం కేసు నమోదు చేసి, 2016 మార్చిలో అరెస్టు చేశారు.
అనంతరం కేసు విచారణలో థానే న్యాయస్థానం వికాస్ ను దోషిగా తేల్చి, ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. బాధితురాలికి పుట్టబోయే బిడ్డకు చెందిన డీఎన్ఏ నివేదికను ప్రసవానంతరం సమర్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. 2016 జూన్ లో బాధితురాలు ప్రసవించింది. అనంతరం ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన శిశువు తాలూకు డీఎన్ఏ రిపోర్ట్ ను 2017 సెప్టెంబర్ లో పోలీసులు న్యాయస్థానానికి సమర్పించారు.
అయితే, ఈ రిపోర్ట్ లోని డీఎన్ఏతో వికాస్ డీఎన్ఏ కలవలేదు. దీంతో మరోసారి ఈ కేసులో వాదనలు విన్న న్యాయస్థానం వికాస్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఏప్రిల్ 15 నాటికి వికాస్ ను ఈ కేసు నుంచి విముక్తి చేస్తామని తెలిపింది.