AMAZON: భారత్ లో 60 మంది ఉద్యోగులను తొలగించిన అమేజాన్... త్వరలో మరింత మందికీ ఇదే పరిస్థితి!
- మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడంలో భాగమే
- తొలగింపుపై అమేజాన్ వివరణ
- 25 శాతం మందికి పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశం
భారత మార్కెట్లో ఫ్లిప్ కార్ట్, పేటీఎం సంస్థల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న ఈ కామర్స్ సంస్థ అమేజాన్ ఇండియా 60 మంది ఉద్యోగులను తొలగించడం సంచలనానికి దారితీసింది. పోటీలో తగ్గేది లేదంటూ పెట్టుబడులతో తెగ ఉత్సాహం ప్రదర్శిస్తున్న ఈ సంస్థ అంతర్జాతీయంగా తన కార్యకలాపాలను చక్కదిద్దుకునే పనిని చేపట్టింది. అందులో భాగంగా భారత విభాగంలో 60 మంది ఉద్యోగులను తీసేసినట్టు సమాచారం. త్వరలో మరింత మందికి పింక్ స్లిప్ లను చేతిలో పెట్టే అవకాశాలు ఉన్నాయని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు మీడియాకు వివరాలు అందించాయి.
డిసెంబర్ త్రైమాసికం ముగింపు నాటికి పనితీరు మెరుగుపరుచుకోవాలంటూ 25 శాతం మంది ఉద్యోగులకు శ్రీముఖాలు పంపింది. తాజా ఉద్యోగుల తొలగింపుపై ఎదురైన ప్రశ్నలకు అమేజాన్ బదులిచ్చింది. ‘‘అంతర్జాతీయ సంస్థగా మా ఉద్యోగులను చురుగ్గా ఉంచడంతోపాటు, వారి సేవలను సరైన విధంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల కొన్ని ఉద్యోగాలపై ప్రభావం పడుతుంది. ఇలా ఉద్యోగాల నుంచి తొలగింపునకు గురయ్యే వారికి పూర్తి సహకారం అందిస్తాం. మరో చోట ఉపాధి కల్పించే ఆఫర్లు ఇస్తాం’’ అని అమేజాన్ అధికార ప్రతినిధి చెప్పారు.