Facebook: ఫేస్ బుక్ లో లోపాలను చక్కదిద్దడానికి కొన్నేళ్లు పడుతుంది; జుకెర్ బర్గ్
- మూడు, ఆరు నెలల్లోనే సరిచేయాలని ఉంది
- కానీ వాస్తవంలో అందుకు ఎక్కువ సమయమే తీసుకుంటుంది
- యాపిల్ సీఈవో టిమ్ కుక్ విమర్శల్లో వాస్తవం లేదు
- ఫేస్ బుక్ సీఈవో జుకెర్ బర్గ్
ఫేస్ బుక్ లో సమస్యలను సరిచేయడానికి కొన్నేళ్లు పడుతుందని ఆ సంస్థ చీఫ్ మార్క్ జకెర్ బర్గ్ అన్నారు. ఫేస్ బుక్ లో లక్షలాది మంది యూజర్ల సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలైటికా అనే కంపెనీ చోరీ చేయడం, దీనిపై అన్ని వర్గాల నుంచి ఫేస్ బుక్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం తెలిసిందే. ఇందుకు ఆ సంస్థ క్షమాపణలు కూడా చెప్పింది. పలు కోర్టుల్లో వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో వోక్స్ అనే మీడియా సంస్థతో జుకెర్ బర్గ్ మాట్లాడారు.
‘‘ఈ లోపాలను పరిహరించగలం. కానీ కొన్నేళ్ల సమయం పడుతుంది. ఈ సమస్యలను మూడు లేదా ఆరు నెలల్లోపే సరిచేయాలని నేను కోరుకుంటున్నాను. కానీ, వాస్తవం ఏమిటంటే ఇంతకంటే ఎక్కువ సమయమే పడుతుంది’’ అని జుకెర్ బర్గ్ చెప్పారు. యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఫేస్ బుక్ పై చేసిన విమర్శలపైనా స్పందించారు. యూజర్ల డేటాను సొమ్ము చేసుకోవాలనే వ్యాపార నమూనాతో ఫేస్ బుక్ చిక్కుల్లో పడిందని టిమ్ కుక్ ఇటీవలే అన్నారు. అయితే, కంపెనీ వ్యాపార నమూనాను జుకెర్ బర్గ్ సమర్థించుకున్నారు. ‘‘మీరు ఏదీ చెల్లించనప్పుడు మీ మాటల్ని పట్టించుకోం. మీ మాటల్లో ఏ మాత్రం వాస్తవం లేదు’’ అని ఆగ్రహంగా పేర్కొన్నారు.