Harish Rao: ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరుగుతున్నాయి కాబట్టే కేసులు పెరుగుతున్నాయి: హరీశ్ రావు
- దేశంలో గుణాత్మక మార్పు రావాలి
- ప్రతి ఏడాది 40 వేలకు పైగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే అధికం
- వారి బాధను లోతుగా అర్థం చేసుకోవాలి
దేశంలో గుణాత్మక మార్పు వస్తేనే అట్టడుగు వర్గాల కష్టాలు తీరుతాయని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని కీలక నిబంధనలను మార్చుతూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంపై దేశ వ్యాప్తంగా దళితసంఘాలు భగ్గుమంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న భారత్ బంద్ కూడా నిర్వహించారు.
ఈ విషయంపై హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌లో ప్రతి ఏడాది 40 వేలకు పైగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదవుతున్నాయని, దాడులు పెరుగుతున్నాయి కాబట్టే కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. వారి బాధను లోతుగా అర్థం చేసుకోవాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. బీహార్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అట్రాసిటీ కేసులు అధికంగా నమోదవుతున్నాయని, ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలేనని విమర్శించారు.