Sidha Ramaiah: కర్ణాటకలో బీజేపీ ఆశలు ఆవిరి.. సిద్ధరామయ్యకే జై కొడుతున్న కన్నడిగులు
- ప్రతీ పదిమందిలో ఏడుగురు కాంగ్రెస్ వైపే
- సిద్ధరామయ్య ప్రభుత్వ పాలన భేష్ అంటున్న జనం
- ఏడీఆర్, దక్ష్ సంస్థల సర్వేలో వెల్లడి
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం ద్వారా దక్షిణాదిలో కాలు మోపాలని భావిస్తున్న బీజేపీకి ఆ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తిరిగి పగ్గాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రజల్లో అత్యధికులు ఆయనకే జై కొడుతున్నారు. ఆయన పాలనను భేష్ అంటూ మెచ్చుకుంటున్నారు. పాలన తీరు, అమలు చేస్తున్న పథకాలకు ఎక్కువమంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్), దక్ష్ సంస్థలు నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయాలు వెలుగు చూశాయి. డిసెంబరు 2017 నుంచి ఫిబ్రవరి 2018 మధ్య రాష్ట్రంలోని 224 శాసనసభ నియోజకవర్గాల్లో 13,244 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించిన అనంతరం ఈ వివరాలను వెల్లడించారు. ప్రతి పదిమంది ఓటర్లలో ఏడుగురు సిద్ధరామయ్య ప్రభుత్వానికి జై కొట్టారు. రాష్ట్రంలో కుంభకోణాలు, అవినీతి వ్యవహారాలు ఎక్కడా జరగలేదని, సిద్ధరామయ్య బాగా పనిచేస్తున్నారని అత్యధికులు కితాబిచ్చారు.
మరోవైపు, కర్ణాటకలో గెలుపు కోసం బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇటీవల కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సిద్ధరామయ్య ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. దేశంలోనే ఆయన అత్యంత అవినీతిపరుడని ఆరోపించారు.