Pawan Kalyan: 6న 'పాదయాత్ర చేస్తాం'.. పవన్ కల్యాణ్
- జాతీయ రహదారుల్లో జరుగుతుంది
- ఢిల్లీకి తాకే విధంగా నిరసన
- టీడీపీ, వైసీపీలు విఫలం
ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టకపోవడం దారుణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సభ సజావుగా జరిగేలా చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం బాధ్యతలను విస్మరించిందని అన్నారు. విజయవాడలోని జనసేన కార్యాలయంలో సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, మధులతో కలిసి పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా చర్చించిన వివరాలను మీడియాకు తెలిపారు.
ఈ నెల 6న ఏపీలో పాదయాత్ర చేస్తామని, ముఖ్యంగా జాతీయ రహదారుల్లోను, ఒకవేళ జాతీయ రహదారులు లేని ప్రాంతాల్లో అయితే ముఖ్య కూడళ్లలోనూ పాదయాత్రలు నిర్వహిస్తామని పవన్ కల్యాణ్ చెప్పారు. పూర్తి శాంతియుత పద్ధతిలో ఢిల్లీని తాకే విధంగా నిరసన ఉంటుందని, ఈ పాదయాత్రలో జనసేన, సీపీఎం, సీపీఐ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు. ఈ నెల 6న నిర్వహించనున్న పాదయాత్రలో విజయవాడలో తానూ పాల్గొంటున్నానని, ఏయే జిల్లాల నేతలు ఆయా జిల్లాల్లో పాల్గొంటారని చెప్పారు. టీడీపీ, వైసీపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకుండా పరస్పరం నిందలు వేసుకుంటున్నాయని విమర్శించారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని పవన్ కల్యాణ్ తెలిపారు. అలాగే, ఇటీవల ఎస్సీ, ఎస్టీల వేధింపుల నిరోధక చట్ట సవరణ చేస్తోన్న నేపథ్యంలో నిర్వహించిన బంద్‌లో అంతమంది మృతి చెందడం, గాయాలపాలవడం బాధనిపించిందని, ఈ చర్యను తాము ఖండిస్తున్నామని అన్నారు.