flipkart: అమేజాన్, ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్లపై కేంద్రానికి యాపిల్, నోకియా, లెనోవో ఫిర్యాదు
- భారీ తగ్గింపులు ఇస్తూ నిబంధనలకు పాతరేస్తున్నాయి
- వీటి కారణంగా 6 లక్షల ఉద్యోగాలకు ముప్పు
- వీటిపై చర్యలు తీసుకోవాలని సెల్యులర్ అసోసియేషన్ డిమాండ్
ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమేజాన్, ఫ్లిప్ కార్ట్ మొబైల్ ఫోన్లపై ఇష్టారీతిగా డిస్కౌంట్లు ఇస్తున్నాయంటూ ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థలు కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. ఫోన్ల తయారీ సంఘం ‘ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్’ ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి సురేష్ ప్రభు దృష్టికి తీసుకెళ్లాయి. ఈ సంస్థ మొబైల్ ఫోన్లు, ఇతర ఉత్పత్తులపై మధ్యవర్తుల ద్వారా, భాగస్వామ్య కంపెనీల ద్వారా డిస్కౌంట్లను ఆఫర్ చేస్తూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించాయి.
తగ్గింపులు ఇవ్వడం ద్వారా ఆఫ్ లైన్ దుకాణాదారుల ఆదాయాన్ని హరించేస్తున్నాయని, 6 కోట్ల మంది ఉద్యోగాలకు ముప్పు ఏర్పడిందని ఈ సంఘం కేంద్ర మంత్రికి వివరించింది. ఎఫ్ డీఐ నిబంధనలు ఉల్లంఘించిన ఈ కామర్స్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇండియన్ సెల్యులర్స్ అసోసియేషన్ లో యాపిల్, నోకియా, వివో, లావా, మైక్రోమ్యాక్స్, లెనోవో, మోటరోలా సభ్యత్వం కలిగి ఉన్నాయి.
అయితే, ఈ ఆరోపణలను అమేజాన్ ఇండియా ఖండించింది. భారతీయ చట్టాలకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేసింది. అమేజాన్ డాట్ ఇన్ లో ఉత్పత్తుల ధరలు పూర్తిగా విక్రయదారుల ఇష్టంపైనే ఉంటాయని పేర్కొంది. ఫ్లిప్ కార్ట్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.