BJP: చంద్రబాబుపై విరుచుకుపడ్డ కన్నా లక్ష్మీనారాయణ!
- అసంబద్ధ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ
- హోదా సాధ్యం కాదని ముందు నుంచే చెబుతున్నాం
- ఓ పథకం ప్రకారం కేంద్రంపై బురద
- బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ
పవన్ కల్యాణ్ తో కలసి ఎన్నో అసంబద్ధమైన హామీలను ఇచ్చిన చంద్రబాబునాయుడు ఏపీలో అధికారంలోకి వచ్చి, తన అసమర్థతతో ఈ నాలుగేళ్లూ పాలించారని, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ నిప్పులు చెరిగారు. ఏపీకి ఏం కావాలని అడిగింది బీజేపీయేనని, హోదా సాధ్యం కాదని తాము ముందు నుంచే చెబుతున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఓ పథకం ప్రకారం చంద్రబాబు కేంద్రంపై బురద జల్లుతున్నారని ఆరోపించిన కన్నా, రాజధానికి ప్రణాళిక కోసమంటూ 17 దేశాలు చుట్టి రావడం అవసరమా? అని ప్రశ్నించారు. ప్రత్యేక విమానాలు వేసుకుని విదేశాలు తిరిగి వచ్చిన చంద్రబాబు, ప్రజలు కట్టిన పన్నులను తన సొంతానికి వాడుకున్నారని, ప్రశ్నించిన వారిని జైల్లో పెట్టించారని ఆరోపించారు. పోలవరం సహా ఎన్నో ప్రాజెక్టులను ఆలస్యం చేసింది చంద్రబాబేనని అన్నారు.
పది సంవత్సరాల పాటు హైదరాబాద్ లో ఉండే సౌలభ్యం ఉన్నా, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి అమరావతికి పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. రూ. 1,500 కోట్లతో రాజధానిలో ఎన్నో భవంతులను నిర్మించవచ్చని, కనీసం ఒక్క శాశ్వత భవనానికి కూడా శంకుస్థాపన చేయలేదని అన్నారు. కనీసం తన సొంత హెరిటేజ్ సంస్థను కూడా ఏపీకి తేలేని అసమర్థుడు చంద్రబాబని నిప్పులు చెరిగారు. చంద్రబాబు వైఖరిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, తదుపరి ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు.