amit shah: రాహుల్ గాంధీ ఓ అబద్ధాల కోరు.. 10 మంది మరణానికి కాంగ్రెస్సే కారణం: అమిత్ షా
- విద్వేషాలను రగిలించేందుకు యత్నిస్తున్నారు
- సుప్రీం ఆదేశాలపై రివ్యూ పిటిషన్ వేస్తామని చెప్పాం
- అయినా భారత్ బంద్ కు పిలుపునిచ్చారు
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విమర్శలు కురిపించారు. రాహుల్ ను ఓ అబద్ధాలకోరుగా అభివర్ణించారు. ఎస్సీ, ఎస్టీల గురించి రాహుల్ మాట్లాడుతున్న వీడియోను ట్విట్టర్ లో పెట్టిన అమిత్... 'మొత్తం అబద్ధాలే. సమాజంలో విద్వేషాలను రగిలించేందుకు ఎస్సీ, ఎస్టీ యాక్టును ఎలా ప్రేరేపిస్తున్నాడో చూడండి' అంటూ ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు. భారత్ బంద్ కారణంగా 10 మంది ప్రాణాలు కోల్పోవడానికి కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించాలని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేస్తుందని తాము ప్రకటించినప్పటికీ... భారత్ బంద్ కు కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్ష పార్టీలు పిలుపునిచ్చాయని మండిపడ్డారు. రిజర్వేషన్లను తొలగించాలనే భావన బీజేపీ ప్రభుత్వానికి లేదని... ఇదే సమయంలో దీనికి ఎవరు ప్రయత్నించినా తాము అంగీకరించబోమని చెప్పారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ప్రకారమే తమ రిజర్వేషన్ పాలసీ ఉంటుందని తెలిపారు.