Pawan Kalyan: అమరావతిలో బుద్ధుడి బొమ్మ మాత్రమే కాదు.. ఆయన స్ఫూర్తి కూడా ఉండాలి!: పవన్ కల్యాణ్
- బుద్ధుడు ఎవరినీ హింసించలేదు
- సృష్టి అంతా సమానమేనని చెప్పాడు
- అమరావతిలో ఆయన స్ఫూర్తి అడుగడుగునా కనిపించాలి
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని గౌతమ బుద్ధుడి స్ఫూర్తితో నిర్మించాలని తాను కోరుకుంటున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఐవైఆర్ కృష్ణారావు రాసిన ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకాన్ని విడుదల చేసిన పవన్ అనంతరం మాట్లాడుతూ.. అమరావతిలో బుద్ధుడి బొమ్మ ఉండాలని సర్కారు చెబుతోందని, బుద్ధుడి స్ఫూర్తి కూడా ఉండాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు.
బుద్ధుడు జీవహింస చేయలేదని, ఎవరినీ హింసించలేదని పేర్కొన్నారు. బుద్ధుడు అందరినీ సమానంగా చూశాడని అన్నారు. సృష్టి అంతా సమానమేనని బుద్ధుడు చెప్పాడని, అదే స్ఫూర్తిని అమరావతి నిర్మాణంలో కనబరచాలని పవన్ సూచించారు. నిజమైన బుద్ధుడి స్ఫూర్తినే తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. అందరికీ న్యాయం చేయాలని, రాజధానిలో అందరూ భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు చెప్పారు.