Tamilnadu: తండ్రి మృతదేహాన్ని తీసుకునేందుకు నిరాకరించిన బిడ్డలు.. చెత్తబండిలో మృతదేహం తరలింపు!
- గౌరవంగా బతికిన రాజారామ్
- భార్య మరణంతో తల్లకిందులైన పరిస్థితి
- పారిశుద్ధ్య కార్మికుల సాయంతో అంత్యక్రియలు
కన్నబిడ్డలు తండ్రి మృతదేహాన్ని తీసుకునేందుకు నిరాకరించగా, భార్య ఉన్నంతవరకు గౌరవంగా బతికిన వ్యక్తి అంతిమయాత్ర మున్సిపాలిటీ చెత్తబండిలో జరగడం వేలూరు వాసులను ఆవేదనకు గురి చేసింది. దాని వివరాల్లోకి వెళ్తే... తమిళనాడులోని వేలూరులోని షోలింగర్ కు చెందిన రాజారామ్ (70) కాళ్లుచేతులాడినంతవరకు గౌరవంగా బతికాడు. కొన్నాళ్ల క్రితం భార్య మరణించడంతో రాజారామ్ పరిస్థితి తల్లకిందులైంది. కన్నబిడ్డలు ఆయనను పట్టించుకోవడం మానేశారు.
దీంతో వీధుల్లో భిక్షాటన చేసి జీవించేవాడు. గత నెల 27న ఆయన మృతిచెందడంతో, ఆయన బిడ్డలకు పోలీసులు సమాచారం అందించారు. అయితే ఆయనతో తమకు సంబంధం లేదని వారు ఆయన మృతదేహాన్ని తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో మార్చురీలో భద్రపరిచిన ఆయన మృతదేహానికి, పోస్టు మార్టం నిర్వహించి, పారిశుద్ధ్య కార్మికుల సాయంతో చెత్త తీసుకెళ్లే బండిలో తీసుకెళ్లి, దహనక్రియలు నిర్వహించారు.