ramakrishna: రేపటి అఖిలపక్ష సమావేశానికి మేము వెళ్లట్లేదు: సీపీఐ నేత రామకృష్ణ
- గత అఖిలపక్ష సమావేశంలో మా మాట చెప్పాం
- చంద్రబాబులో చిత్తశుద్ధి కనపడడం లేదు
- అప్పట్లో ప్యాకేజీకి ఒప్పుకున్నారు
- హోదాపై పట్టుబట్టి ఉంటే బాగుండేది
పార్లమెంటులో అవిశ్వాస తీర్మానానికి అవకాశం ఇవ్వకపోవడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ రోజు ఏపీలో సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు పాదయాత్రలు చేసిన విషయం తెలిసిందే. పాదయాత్ర ముగిసిన అనంతరం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపు వల్లే కేంద్ర సర్కారుపై టీడీపీ, వైసీపీలు అవిశ్వాస తీర్మానం పెట్టే వరకు పోరాటం వెళ్లిందని అన్నారు.
రేపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తున్నారని, అయితే గత అఖిలపక్ష సమావేశంలోనే తమ మాట చెప్పామని, రేపటి సమావేశానికి వెళ్లట్లేదని రామకృష్ణ చెప్పారు. చంద్రబాబులో చిత్తశుద్ధి కనపడడం లేదని, అప్పుడే ప్యాకేజీకి ఒప్పుకోకుండా హోదాపై పట్టుబట్టి ఉంటే బాగుండేదని అన్నారు.