Chandrababu: ఆ రోజు మోసం జరిగింది.. ఈ రోజు నమ్మక ద్రోహం జరిగింది: చంద్రబాబు
- కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి మోసం చేసింది
- బీజేపీ చివరకు ద్రోహం చేసింది
- ఐదున్నర కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేశాం
- ఢిల్లీలో ఎంపీలు పోరాడుతున్నారు
విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కి న్యాయం చేయాల్సిందేనని ఈ రోజు ఈ శాసనసభ ద్వారా మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయాలని ఈ రోజు శాసనసభలో చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టి ప్రసంగిస్తూ... ఆ రోజు (విభజన సమయంలో) మోసం జరిగిందని, ఈ రోజు నమ్మక ద్రోహం జరిగిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి మోసం చేసిందని, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ కూడా నమ్మించి చివరకు ద్రోహం చేసిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకి నిరసనగా తాము ఈ రోజు ఐదున్నర కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేశామని అన్నారు.
తమ పార్టీ నేతలిద్దరితో కేంద్ర మంత్రి పదవులకి రాజీనామా చేయించామని, ఢిల్లీలో తమ ఎంపీలు పోరాడుతున్నారని చంద్రబాబు అన్నారు. విభజన హామీలు అమలయ్యేలా ఒత్తిడి తేవడమే తమ లక్ష్యమని, తమకు పదవులు ముఖ్యం కాదని చెప్పారు. ఆ నాడు ఏపీకి అండగా ఉంటానని చెప్పిన మోదీ ఇప్పుడు ఏమీ చేయడం లేదని, ప్రశ్నిస్తే బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారని అన్నారు.