amit shah: మోదీని ఎదుర్కోవడానికి కుక్కలు, పిల్లులు, బాతులు, ముంగిసలు ఏకమయ్యాయి: మండిపడ్డ అమిత్ షా

  • పార్లమెంటు సమావేశాలు జరక్కుండా అడ్డుకుంటున్నారు
  • 40 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమిటి?
  • 10 మందితో ప్రారంభమైన బీజేపీలో.. ఇప్పుడు 11 కోట్ల మంది ఉన్నారు

విపక్ష పార్టీలు, నేతలపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కోవడానికి కుక్కలు, పిల్లులు, బాతులు, ముంగిసలన్నీ ఏకమయ్యాయని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ 38వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగాలని, సమస్యలపై అర్థవంతమైన చర్చ జరగాలని ఓ వైపు మోదీ కోరుతుంటే... విపక్షాలు మాత్రం సభ జరక్కుండా అడ్డుకునేందుకు యత్నిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రతి రోజూ కొనసాగిన ఆందోళనలతో ఈ బడ్జెట్ సెషన్ మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని... దాదాపు 250 గంటల విలువైన సమయం వృథా అయిందని చెప్పారు.

అధికారంలో ఉన్న 40 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిందేమిటంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. ఈ నాలుగేళ్ల రిపోర్ట్ కార్డు కావాలని రాహుల్ అడుగుతున్నారని... కానీ, 40 ఏళ్లలో మీరు చేసిందేమిటంటూ కాంగ్రెస్ ను ప్రజలు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లను ఎత్తివేయాలనే ఆలోచన బీజేపీకి ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ పనిని మరే ఇతర పార్టీ చేయాలని భావించినా, బీజేపీ అడ్డుకుంటుందని చెప్పారు.

కేవలం 10 మందితో బీజేపీ ప్రారంభమయిందని... ఇప్పుడు 11 కోట్ల మంది బీజేపీలో ఉన్నారని అమిత్ తెలిపారు. చరిత్రలో దేశం కోసం ఎక్కువ త్యాగం చేసిన ఘనత బీజేపీ శ్రేణులదే అని చెప్పారు.

  • Loading...

More Telugu News