Andhra Pradesh: వడదెబ్బ నివారణ, తాగునీటి సమస్య రాకుండా రాష్ట్రంలో ముందు జాగ్రత్త చర్యలు: ఏపీ సీఎస్
- అధికారులకు దినేశ్ కుమార్ ఆదేశాలు
- 398 ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా
- పెద్ద ఎత్తున చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేయాలి
- మజ్జిగ, మంచినీటిని అందించాలి
వేసవి దృష్ట్యా రాష్ట్రంలో వడదెబ్బ నివారణ చర్యలతో పాటు ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు అమరావతి సచివాలయంలో వడదెబ్బ నివారణ చర్యలు, అగ్ని ప్రమాదాలు, తాగునీరు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు జిల్లాల్లో ఎన్ని చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేశారో, నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ఎన్ని ఆవాస ప్రాంతాలకు మంచి నీటి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారో సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కమిషనర్ శేషగిరి బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ... జిల్లా కలెక్టర్లు 60 కోట్ల రూపాయల నిధులు అవసరమని కోరారని ప్రస్తుతం వారి వద్ద 12 కోట్ల నిధులు ఉన్నాయని చెప్పారు. దీంతో సీఎస్ మాట్లాడుతూ.. ముందు ఆ 12 కోట్ల రూపాయలను తక్షణ మంచినీటి అవసరాలకు ఖర్చు చేయాలని మిగతా అవసరమైన నిధులను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. తక్షణ తాగునీటి అవసరాలకు సంబంధించి ఎలాంటి నిధుల కొరత రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్రను సీఎస్ ఆదేశించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 398 ఆవాస ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నట్టు ఆ శాఖ కార్యదర్శి రామాంజనేయులు వివరించగా సీఎస్ స్పందించి తాగునీటిని ట్యాంకర్ల ద్వారా అందించాల్సిన పరిస్థితులను నివారించేందుకు తగిన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వడ దెబ్బ తీవ్రత నుండి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు వీలుగా ప్రభుత్వం తరుఫున, దాతలు, వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో పెద్ద ఎత్తున చలివేంద్రం కేంద్రాలను ఏర్పాటు చేసి మజ్జిగ, మంచినీటిని అందించేందుకు వీలుగా కలెక్టర్లు తగిన చొరవ తీసుకోవాలని సీఎస్ దినేశ్ కుమార్ ఆదేశించారు.