Tamil Nadu: నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని విద్యార్థినులను చావబాదిన ఉపాధ్యాయులు
- ఇద్దరు బాలికలను మోకాళ్లపై నిలబెట్టి బెత్తంతో చావగొట్టిన ఉపాధ్యాయులు
- బొట్టు చెరిపివేయించి, పూలు తీసివేయించిన వైనం
- టీసీలు ఇచ్చి పంపించి వేస్తామంటూ హెచ్చరిక
ఆ విద్యార్థినులు నుదుట బొట్టు పెట్టుకుని, తలలో పూలు తురుముకుని రావడమే పెద్ద నేరమైంది. వారిని చూసిన పాఠశాల నిర్వాహకులు ఆగ్రహంతో ఊగిపోయారు. స్కూలుకు బొట్టు పెట్టుకుని వస్తారా? అంటూ బెత్తంతో చావబాదారు. మోకాళ్లపై నిలబెట్టారు. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో జరిగిందీ ఘటన. పాఠశాల యాజమాన్యం తీరుపై సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిర్వాహకుల తీరును నిరసిస్తూ బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు శుక్రవారం పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు.
జిల్లాలోని సేత్తుపట్టు సమీపంలోని దేవికాపురంలో క్రిస్టియన్ మెట్రిక్యులేషన్ స్కూలు ఉంది. ఇక్కడ కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. అమ్మాయిలు తలలో పూలు, నుదుట బొట్టు పెట్టుకోకూడదన్న నిబంధన కూడా ఉంది. మూడు రోజల క్రితం ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు బొట్టు, పూలు పెట్టుకుని రావడంతో చూసిన ఉపాధ్యాయులు ఆగ్రహంతో వారిని చితకబాదారు. బొట్టు చెరిపివేయించి, పూలను తీసి వేయించారు. అనంతరం ఇద్దరినీ మోకాళ్లపై కూర్చోబెట్టి బెత్తంతో చావబాదారు.
తీవ్ర గాయాలపాలైన బాలికలు ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు స్కూలు యాజమాన్యాన్ని నిలదీశారు. స్కూలు నిబంధనల మేరకే బొట్టు, పూలు తీయించామని, మరోసారి అలా చేయకుండా ఉండాలనే బెత్తంతో కొట్టినట్టు తీరిగ్గా సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా, ఇద్దరికీ టీసీలు ఇచ్చి పంపించేస్తామని బెదిరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థినుల తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు.