Goa: గోవాపై దాడికి బోటులో వస్తున్న ఉగ్రవాదులు.. ప్రభుత్వం హై అలెర్ట్!
- కరాచీ నుంచి బోటులో బయలుదేరిన ఉగ్రవాదులు
- నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన ప్రభుత్వం
- హెచ్చరికలు జారీ
గోవాపై దాడికి ఉగ్రవాదులు పొంచి ఉన్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మత్య్సకారులు ఉపయోగించే బోటు ద్వారా ఉగ్రవాదులు గోవాలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఓడ రేవుల మంత్రి జయేష్ సాల్గోవాంకర్ తెలిపారు. తీరంలో ఉన్న క్యాసినోలు, వాటర్ స్పోర్ట్స్ ఆపరేటర్లు తదితరులకు హెచ్చరికలు జారీ చేశారు.
పశ్చిమ తీర ప్రాంతంపై ఉగ్రవాదులు దాడిచేసే అవకాశం ఉందని సమాచారం అందిందని మంత్రి తెలిపారు. ముంబై నుంచి గుజరాత్ తీరం వరకు ఉగ్రవాదులు ఎక్కడైనా దాడికి పాల్పడే అవకాశం ఉండడంతో తీర ప్రాంతం మొత్తం అలెర్ట్ ప్రకటించినట్టు చెప్పారు.
ఇటీవల భారత్‌కు చెందిన ఫిషింగ్ ట్రాలర్‌ను సీజ్ చేసిన పాకిస్థాన్ తాజాగా విడుదల చేసింది. ఇప్పుడా బోటు ఉగ్రవాదులను మోసుకుని వస్తోందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందినట్టు మంత్రి వివరించారు. కరాచీ నుంచి ఉగ్రవాదులతో బయలుదేరిన బోటు భారత తీరప్రాంతంలో ఎక్కడైనా ఒడ్డుకు చేరే అవకాశం ఉందని మంత్రి సాల్గోవాంకర్ పేర్కొన్నారు.